Pages

Thursday, 11 August 2011

ఎందుకు, ఏమిటి, ఎలా ...

కర్పూరం 

కర్పూరం గొప్పేంటి? కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల? అందులో ఏముంటాయి. మనం తెలుసుకుందామా!

కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు.

 లేత ఆకుల రంగు ఎరుపు ఎందుకు  


మామిడి, వేప, గులాబి లాంటి చెట్ల చిగుళ్ళు లేత గులాబి రంగులో ఉండడం మనకు తెలుసు. క్రమేపీ అవే
ఆకుపచ్చ రంగులోకి మారుతుంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? ఆకుల్లో ఉండే రకరకాల పదార్థాలే!

చెట్ల ఆకుల్లోని ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఉదాహరణకు క్లోరోఫిల్ అనే పదార్థానికి ఆకుపచ్చ రంగు, కెరోటిన్‌కి పసుపుపచ్చ రంగు ఉంటాయి. ఒక ఆకులో రంగు రంగుల పదార్థాలు ఉండడంవల్ల అది ఆయా రంగుల మిశ్రమం రంగుని వెదజల్లుతుంది. ఆకుల్లో చాలా వరకు క్లోరోఫిల్, కెరోటిన్ పాళ్ళు ఎక్కువగా ఉండడంవల్ల అవి ఆకుపచ్చగా కనబడతాయి. మరి కొత్తగా ఏర్పడిన చిగురుటాకుల్లో ఏ పదార్థం ఉంటుందో తెలుసా? ఎండోసైనిన్ అనే ఎరుపురంగు గల పదార్థం. అదీ ఎక్కువగా శాతంలో ఉంటుంది. ఆ పదార్థం తక్కువ శాతంలో ఉన్న ఇతర పదార్థాలతో కలవడంతో ఆకులు లేతగా ఉన్నప్పుడు లేత ఎరుపు, లేత గులాబీ రంగులో ఉంటాయి. ఆకులు ముదిరేకొద్దీ క్లోరోఫిల్, కెరోటిన్ పదార్థాల శాతం ఎక్కువ కావడం, దాంతో అవి ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతాయి. తర్వాత రోజుల్లో ఆకులు మందంగా పెరిగి, కెరోటిన్ పదార్థం శాతం ఎక్కువ అవడంతో పసుపుపచ్చగా మారి, అంటే పండుటాకులై ఎండి చెట్ల నుండి రాలిపోతాయి.

చెట్టు నీడ చల్లనేల  


గోడనీడ వేడిగా ఉంటుంది. కానీ చేట్టు నీడ చల్లగా ఉంటుంది. ఈ తేడా ఏమిటి. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకుందామా!

గోడ ఓ నిర్జీవ ఘన పదార్థం. దృశ్యకాంతి ఏమాత్రం గోడలోంచి దూసుకుపోదు. కాబట్టి గోడకు ఇవతల వైపు నీడ ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటు, అధిక శక్తిమంతమైన అతినీల లోహిత కాంతి, తక్కువ శక్తిమంతమైనదే అయినా ఉష్ణభాగం అధికంగా ఉన్న పరారుణ కాంతి కూడా ఉంటాయి. గోడ మీద పడిన కాంతిలో కొంత భాగం ఆవలి వైపున పరానవర్తనం చెందినా, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతిశక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడస్ నుంచి అన్ని వైపులకు ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలివైపు కూడా వస్తుంది. దీని వల్లనే మనకు గోడ నీడలో ఉక్కపోసినట్లుగా అనిపిస్తుంది. ఇక చెట్టు ఒక జీవి. తన ఉష్ణోగ్రతను క్రమబద్దికరించుకునే యంత్రాంగం చెట్ల ఆకులకు ఉంది. ఆకుపై పడిన కాంతి కొంత పరావర్తనమైనా కొంత భాగం కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడుతుంది. మిగిలిన కాంతి ఆకు కణాల ఉష్ణోగ్రతను పెంచక ముందే ఆకు భాష్పోత్సేకం ద్వారా నీటి ఆవిరిని విడుదల చేస్తూ కాంతిశక్తిని తటస్థపరుస్తుంది. ఆ విధంగా తమ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుకునే వేలాది ఆకులను తాకి చల్లబడిన గాలి ఆ చెట్టు నీడన ఉన్న మనల్ని తాకగానే హాయిగా అనిపిస్తుంది. 

నత్తి
కొందరు మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడతారు ఎందువల్ల? దానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం.

నత్తికి కారణం పుట్టుకతోనే ఆ వ్యక్తి మెదడు నిర్మాణంలో జరిగిన లోపం కావచ్చు. లేదా పసితనంలొ అతితీవ్రమైన ఒత్తిడికి గురి చేసిన సంఘటన కావచ్చు. ఈ అస్వస్థత చిన్నతనంలో రెండు, మూడు సంవత్సరాల వయసు మధ్య ప్రారంభమవుతుంది. ప్రస్తుత శాస్త్రీయ సిద్దాంతాల ప్రకారం నత్తికి కారణం అనేకమైన జన్యుసంబంధమైన లేక పరిసరాల ప్రభావమే. నత్తికి కారణం మాట్లాడే భాషపై నైపుణ్య, లేకపోవడమా లేక వ్యక్తిత్వం, స్వభావాల్లో మార్పు రావడమూ అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. నత్తి ఉన్నవారు కొన్ని అక్షరాలను కానీ, పదాలను కానీ గబుక్కున పలకలేక కష్టపడి ప్రయత్నం చేసి మాట్లాడతారు. వీరిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నామనే సిగ్గుతో పాటు, ఎవరైనా వెటకారం చేయడం వల్ల ఆత్మన్యూనతా భావం పెరిగి నత్తి సమస్య మరింత పెరుగుతుంది. మాట్లాడే మాటల నిర్మాణం మార్చుకునేటట్లు శిక్షణ ఇచ్చే వైద్యుల, నిపుణుల సూచనల ద్వారా, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కొంతమేరకు నత్తిని తగ్గించవచ్చు. కానీ పూర్తిగా నివారించడం ఒక శారీరక రుగ్మత మాత్రమే. అలా మాట్లాడేవారిని హేళన చేయడం అవివేకం. 

పిల్లి _ పులి కళ్ళు
 రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు లాంటి జంతువుల కళ్ళు మెరుస్తాయెందుకు అనే విషయం మీకు తెలుసా ! తెలియకపోతో ఇది ఓక సారి చదవండి.

పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో టాపిటం ల్యూసిడం అనే ప్రత్యేకమైన సన్నని పొర ఉంటుంది ఈ పొరకు కాంతిని పరావర్తనం చేసే భౌతిక ధర్మం ఉంది. కొంతమేరకు పారదర్శకంగా ఉండే ఈ పొర కుంభాకారదర్పణం ఆకారంలో ఉంటుంది. కుంభాకార దర్పణంపై కాంతి కిరణాలు పడినప్పుడూ అవి పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. ఆ కిరణాల వల్లనే మనకు ఆయా జంతువుల కళ్ళూ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ పొర వలనే ఆ జంతువులు చీకట్లో కూడా పరిసరాలను చూడగలుగుతాయి.

జ్వరమొస్తే వనుకేందుకు

జ్వరం వచ్చిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కదా. కానీ అతడు చలితో వణికి పోతూ దుప్పటి కప్పుకుంటాడెందుకు మీకు తెలుసా? దీనికంతటికి కారణం ఏమిటో మనం తెలుసుకుందాం.

ఒక వ్యక్తికి చలి వేస్తుందా, ఉక్కపోస్తుందా అనే విషయం ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాను బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి బయటి ఉష్ణం చేరుకుంటుంది. ఆ అధిక వేడిని నివృత్తి చేసుకోవడానికి చెమట పట్టి శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం అవుతుంది. అప్పుడే మనకు ఉక్కపోత అనే భావన కలుగుతుంది. శీతాకాలంలో బయటి ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చలి భావనకు లోనవుతాము. సాధారణ పరిస్థితుల్లో వాతావరణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే, ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.7 డిగ్రీల ఫారెన్ హీట్) ఉంటుంది. కాబట్టి ఉష్ణశక్తి వినిమయం శరీరం నుంచి బయటికి కానీ, బయటి నుంచి శరీరానికి కానీ పెద్దగా ఉండదు. అందువల్ల అంత ఇబ్బందిగా ఉండదు. జ్వరంతో ఉన్న వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడు (105 డిగ్రీల ఫారెన్ హీట్) వరకు ఉండవచ్చు. అంటే వాతావరణ ఉష్ణోగ్రత కన్నా హెచ్చన్నమాట. కాబట్టి ఉష్ణశక్తి శరీరం నుంచి బయటి వైపు వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చలి భావన కలుగుతుందని చెప్పుకున్నాం కదా. అందుకె మరి వణకడం అర్థమైనదా.

హెడ్ అండ్ టైల్

 తెలుగులో బొమ్మ-బొరుసు అంటాం. ఇంగ్లీషులో హెడ్ అండ్ టెయిల్ అంటారు. క్రికెట్ ఆటను మొదలెట్టే సమయంలో కెప్టెన్లు హెడ్ షో, టెయిల్ ‌నో ఎంచుకుంటారు. ఈ మాట ఎలా వచ్చింది అనంటే ఇంగ్లాండ్‌లోని పది పెన్నీలబిళ్ళను చూడాలి. ఈ బిళ్ళపై ఒక వైపు విక్టోరియా మహారాణి ముఖం (హెడ్) ఉంటుంది. మరో వైపు తోక ఎత్తిన సింహం బొమ్మ (టెయిల్) ఉంటుంది. కాలక్రమంలో ఈ తోకే బొరుసుకు ప్రత్యామ్నాయంగా టెయిల్‌గా అవతరించింది. 

సూర్యుడికి కోపమా?

ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు సూర్యుడు ఎర్రగా ఎందుకు ఉంటాడు. సూర్యుడు వెలువరించే తెల్లని కాంతి కిరణాలు ఏడురంగుల మిశ్రమమని మీకు తెలుసుగా. ఊదా, నీలి, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, కాషాయం, ఎరుపు అనే ఏడు రంగులను అంటారని మీరుపాఠాల్లో చదువుకొని ఉంటారు. భూమి వాతావరణంలో సూర్యుని కిరణాలు మన కంటికి చేరేంతవరకు ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. ఉదయం, అస్తమయాల్లో సూర్యుని కిరణాలు మన కంటికి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణించాలి. దూరంగా భూమి, ఆకాశం కలసినట్లు కనిపించే క్షితిజరేఖకు దగ్గరగా సూర్యుడు ఉదయాస్తమయాల్లో ఉండడమే ఇందుకు కారణం. అదే మధ్యాహ్నం సూర్యుడు మన నడినెత్తిన ఉన్నపడు కిరణాలు తక్కువ దూరం ప్రయాణించి మన కంటిని చేరుతాయి.

వాతావరణంలోని గాలి, దుమ్ము, ధూళి, నీటిఆవిరి కణాలు సూర్యకిరణాలలోని అన్ని రంగుల కన్నా ఊదారంగు పౌనహపున్యం ఎక్కువ కాబట్టి అది ఎక్కువగా చెదిరిపోతుంది. వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ తక్కువగా చెదిరిపోయే ఎరుపు రంగుమన కంటికి ఎక్కువగా చేరుకోవడం వల్ల సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.

No comments:

Post a Comment